23 June 2024 “ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ఉచిత కుట్టు శిక్షణా శిబిర ప్రారంభోత్సవం”
- ప్రారంభించిన ట్రస్ట్ చైర్మన్, పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా సద్గురువర్యులు
- హాజరైన తణుకు శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణగారు
సేవ ద్వారా భగవంతుని ఆశీస్సులు పొందటానికి అర్హతను పొందగలమని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు తెలిపారు. ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న రెండవ ఉచిత కుట్టు శిక్షణా శిబిరాన్ని ఆదివారం ప్రారంభించిన డా.ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ మనము భూమిపైకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, అలాగే పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకువెళ్లలేము. సేవ చేయాలి అనుకున్నప్పుడు అనేక అవాంతరాలు, అవరోధాలు ఏర్పడవచ్చు. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా సాధించాలనే సత్సంకల్పంతో ప్రయాణించినట్లయితే చక్కటి ఫలితం పొందవచ్చని ప్రేరణను అందించారు.
పర్యావరణపరంగా ప్రకృతిలో అనేక మార్పులను గమనిస్తూ ఉన్నాము. అవసరమైన సమయానికి వర్షాలు కురవకపోవడం, అవసరం లేని సమయంలో వర్షాలు కురిసి పంటలు పాడవటం జరుగుతుంది. మొక్కల వల్ల పొందేటువంటి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని గత 20 సంవత్సరాల క్రితమే ఈ పీఠం ద్వారా “నా మొక్క నా శ్వాస” కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటడం మొదలుపెట్టామని, ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగిందని, అందరూ పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మూడు మొక్కలు నాటుతూ, తోటివారితో నాటిస్తూ వాటిని కాపాడుతూ పెంచి పెద్ద చేసి వాటి యొక్క ఫలాలు, పుష్పాలు భగవంతునికి సమర్పించడం ద్వారా భగవంతుని ఆశీస్సులు పొందవచ్చని ప్రబోధించారు.
మొక్కలు నాటటానికి ఇది చక్కటి సమయం. ఎండలు తగ్గిన తర్వాత వర్షాలు మొదలయ్యాయి కాబట్టి మొక్కలు నాటి భగవంతుని ఆశీస్సులు పొంది తరించాలని పిలుపునిచ్చారు.
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్” మనిషికి రెండు కళ్ళు ఏ విధంగా అవసరమో అదే విధంగా ఆధ్యాత్మిక నేత్రము, సామాజిక సేవా నేత్రము అనే రెండూ అవసరమని, మానవసేవే మాధవసేవ అని, ఆ స్ఫూర్తితో ట్రస్ట్ ద్వారా డా.దండు పద్మావతిగారు బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని ఎన్నో చక్కని సేవలందిస్తున్నారని, వారి సేవలు అందరికీ ఆదర్శమని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన తణుకు శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణగారు మాట్లాడుతూ పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషావారు చేస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవలు అందరికీ ఆదర్శం అని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో తాను కూడా సేవలందిస్తానని తెలిపారు.
ఈ సభలో గ్రామ సర్పంచ్ శ్రీ కసిరెడ్డి బాల లక్ష్మీనారాయణగారు మాట్లాడుతూ ట్రస్ట్ సేవా కార్యక్రమం నిర్వహించడం అంటే చాలా వ్యయప్రయాసలతో కూడిన కార్యక్రమం అయినప్పటికీ, డాక్టర్ పద్మావతిగారు నిర్వహించటం చాలా ఆనందదాయకం అని, వారికి చేతనైన సహకారం చేస్తానన్నారు.
గ్రామాన్ని దత్తత తీసుకున్న డాక్టర్ పద్మావతిగారు మాట్లాడుతూ ట్రస్ట్ యొక్క సామాజిక కార్యక్రమాలు పిఠాపురంతోపాటు ఆశ్రమ శాఖల ద్వారా కూడా నిర్వహిస్తే ఎక్కువమంది లబ్ధి పొంది ఆనందిస్తారనే ఆలోచన కలిగి, స్వామివారి అనుమతితో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఉచిత వైద్యానికి సహకరిస్తున్న ప్రత్తిపాడు ఏ.ఎస్.ఆర్ హోమియోపతి కాలేజీవారిని, కుట్టు శిక్షణ అందిస్తున్న గౌసియా బేగంగారిని, కట్టా లక్ష్మిగారిని అభినందించి ధన్యవాదాలు తెలిపారు.
ట్రస్ట్ నిర్వహించిన ఐదు ప్రధాన కార్యక్రమాల నివేదికను ట్రస్ట్ శాఖా నిర్వాహకులు శ్రీ యర్రంశెట్టి శివన్నారాయణ సభకు వివరించారు. ఈ సందర్భంగా మొదటి కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రశంసాపత్రాలను అందించారు. వివిధ పోటీల్లో బహుమతులు సాధించిన బాలలకు బహుమతులు అందించారు. ట్రస్ట్ ద్వారా దత్తత తీసుకుని చక్కగా సేవలందిస్తున్న డా.దండు పద్మావతి గారిని పీఠాధిపతులు ఆలీషావారు శాలువాతో సత్కరించారు.
కార్యక్రమాన్ని ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా పీఠం కన్వీనర్ శ్రీ అడబాల నాగవేంకట రత్నంగారు నిర్వహించగా, అవధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు వందన సమర్పణతో సభ ముగిసింది.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు శ్రీ ప్రగడ నాగేశ్వరరావు, ధనుమూరి వేంకటేశ్వర రావు, గారపాటి బాబ్జి, ముత్యాల నాగేశ్వరరావు తదితర గ్రామ ప్రముఖులు, అధిక సంఖ్యలో పీఠ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.