బల్లిపాడులో మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం ప్రారంభము
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం అనుబంధ సంస్థ అయిన ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో బల్లిపాడు గ్రామంలో 28-4-24, ఆదివారం ప్రముఖ వైద్యులు బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న డా. దండు పద్మావతి గారు మరియు గ్రామ పెద్దలు మజ్జిగ చలివేంద్రాన్ని, పక్షుల చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.పద్మావతి గారు మాట్లాడుతూ ట్రస్టు ద్వారా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం మానవత్వం ఈశ్వరత్వం, మానవసేవయే మాధవసేవ అనేటువంటి భావనతో నిఃస్వార్థంగా సేవ చేయడమని తెలియజేశారు. అంతేకాకుండా పక్షుల చలివేంద్రాన్ని కూడా ప్రారంభించామని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటువంటి చలివేంద్రాలు ట్రస్ట్ ద్వారా ఎన్నో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.పక్షులకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో ఆవశ్యకమని అన్నారు.
ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన తోట వేంకటేశ్వర రావు, ధనుమూరి వేంకటేశ్వరరావు, గారపాటి నాగేశ్వరరావు, ముత్యాల నాగేశ్వరరావు, గారపాటి ధర్మయ్య, ఆకుల రామచంద్రరావు తదితరులు ట్రస్ట్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆచంట సుబ్బారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉమర్ ఆలీషాగారి ఆశయాలకు అనుగుణంగా బల్లిపాడులో ట్రస్ట్ కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు. శ్రీ ఆకుల బులి నాగేశ్వరరావు మాట్లాడుతూ డా.పద్మావతిగారు దత్తత తీసుకుని ఎన్నో మంచి సేవలు చేస్తున్నారని అభినందించారు. అవధాని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగి, అందరూ మానవసేవను మాధవ సేవగా భావించి చేస్తే విశ్వశాంతి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, సభ్యులు, అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు, గ్రామీణులు పాల్గొన్నారు.