2023 World Environment Day | Athili| 5th June 2023

Athili - World Environment Day

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి

సోమవారం, 5th Jun 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం బల్లిపాడు ఆశ్రమ శాఖలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని పరిరక్షించగలమని, దాని కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని అత్తిలి మండలం అగ్రికల్చరల్ ఆఫీసర్ శ్రీ రాజేశ్ గారు పిలుపునిచ్చారు.

ఈ సభాకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమాలు చేపడుతూ, పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు దోహదం చేసేలా మొక్కలు నాటుతూ, చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తూ విశేషమైన సేవలు చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమవంతుగా ఆలోచించి ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి, దానికి బదులుగా ఉన్న వాటిని ఉపయోగిస్తూ మొక్కలు నాటి కాపాడుతూ, పంచ భూతాలను సమతుల్యంగా ఉంచేలా ప్రయత్నించాలని కోరారు.

ఈ సభలో ప్రత్యేక అతిథులుగా పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ శ్రీ ఆనంద కుమార్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ జయరామ కృష్ణ, గ్రామ మాజీ సర్పంచ్ ధనుమూరి వెంకటేశ్వరరావు, టీచర్ యర్రంశెట్టి సురేశ్ కుమార్ పాల్గొని ట్రస్ట్ కార్యక్రమాలను ప్రశంసించారు.

ప్రముఖ అవధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పీఠాధిపతులు ఉమర్ ఆలీషా స్వామి ఆధ్యాత్మిక తత్త్వజ్ఞానంతో పాటు సామాజిక స్ఫూర్తిని కలిగించడానికి ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేయిస్తున్నారని, పర్యావరణ పరిరక్షణకు అనేక ప్రాంతాల్లో, నగరాల్లో లక్షల మొక్కలు నాటారని ఆ ప్రేరణతో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి కాపాడాలని ప్రేరేపించారు. ఈ సందర్భంగా పక్షులకు ఆహారంగా ఏర్పాటు చేయడానికి వరికుచ్చులను అందించడం జరిగింది.

ఈ సదస్సులో గ్రామ పురజనులు, గ్రామ కన్వీనరు
చీపురుపల్లి సత్యనారాయణ, ట్రస్ట్ కార్యకర్తలు కమ్మంపాటి సర్వమూర్తి, యర్రంశెట్టి శివన్నారాయణ, కాళ్ళ ఉమేష్ ,కాళ్ళ నాగేశ్వరరావు, సింగంపల్లి నాగ వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Back To Top